Sajjala Rama Krishna Reddy Warns To Employee Unions
ఏపీలో ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉద్యోగుల తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదని అన్నారు. ఉద్యోగులను రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదని, గతంలో ఇచ్చిన లిఖితపూర్వక ఆహ్వానం మేరకు వారు చర్చలకు రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? అంటూ సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలు కూడా చేరాయని, సమ్మెలో రాజకీయ పార్టీల చేరికతో ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. పరిస్థితి చేయి దాటుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఇచ్చిన అవకాశాలు వదులుకుంటున్నారని అసహనం వెలిబుచ్చారు. కొవిడ్ వేళ భారీ సామూహిక కార్యక్రమాలు సరికాదని సజ్జల హితవు పలికారు.
ఇక ఉద్యమ కార్యాచరణలోకి వెళుతుంటే ప్రభుత్వం బదిలీలు చేస్తోందన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఉద్యోగులే బదిలీలు కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఆ ప్రక్రియను ఎందుకు ఆపుతుందని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? అని అన్నారు. సమ్మెకు వెళుతున్న ఉద్యోగులు అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు పాల్పడినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం, గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్లే ఆర్థికభారం పెరిగిందని సజ్జల వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్లు 70కి పైగా ఉన్నాయని, అవి ఎంతవరకు పరిష్కారానికి నోచుకుంటాయో తెలియదని సందేహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత రావాలంటే చర్చలే మార్గమని తేల్చిచెప్పారు.