Nagiri MLA RK Roja Selvamani Ready To Resign…?
YSR Congress Party ఫైర్ బ్రాండ్ అయిన నగరి MLA ఆర్కే రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె ఏం చేసినా ప్రజలతో పాటు మీడియా అటెన్షన్ బాగా ఉంటుంది. ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో తన నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఫలితాల తర్వాత నగరి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నగరి పరిధిలోని నిండ్ర ఎంపీపీ విషయంలో అధికారపార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వ్యవహారం కాస్తా రోజా వర్సెస్ శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డిగా మారింది. దీంతో సెప్టెంబర్ 25న జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. అదే రోజు రోజాకి చక్రపాణిరెడ్డికి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఐతే ఎంపీపీ విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో ఈ పంచాయితీ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి వద్దకు చేరింది. చివరకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే రోజా నిర్ణయం వైపే మొగ్గుచూపింది. దీంతో నిండ్ర ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగింది. ఇక్కడ జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకుగానూ ఏడు వైసీపీకి, ఒకటి టీడీపీకి దక్కాయి. ఏపీపీ పదవి కోసం వైసీపీలోని ఇరువర్గాలూ పట్టుదలకు పోయాయి. రోజా తాను ఎమ్మెల్యే కనుక తను నిర్ణయించిన అభ్యర్థే ఎంపీపీగా ఎన్నిక కావాలని పట్టుబట్టగా.., మెజారిటీ ఎంపీటీసీలు తమ వర్గీయులు కనుక తాము సూచించిన అభ్యర్థే ఎంపీపీ కావాలని చక్రపాణిరెడ్డి భీష్మించుకున్నారు. నిండ్ర ఎంపీపీ అభ్యర్థి విషయంలో రోజాకు, చక్రపాణి రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. చక్రపాణి రెడ్డి తన తమ్ముడికి ఎంపీపీ ఇవ్వాలని పట్టుబట్టగా.. రోజా మాత్రం తాను సూచించిన అభ్యర్థే ఎమ్మెల్యే కావాలని భీష్మించుకొని కూర్చున్నారు. వీళ్లిద్దరూ జాయింట్ కలెక్టర్ ఎదుటే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకున్నారు. మగాడివైతే నువ్వు ఇండిపెండెంట్ పోటీచేయాలంటూ రోజా చక్రపాణి రెడ్డికి సవాల్ విసిరితే… నువ్వే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి నాతో తలపడాలని చక్రపాణి ప్రతిసవాల్ విసిరారు. ఈ వ్యవహరం అధిష్టానం వద్దకు వెళ్లడంతో ఎమ్మెల్యే సూచించిన మేరకే నడుచుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో వ్యవహారం కొలిక్కి వచ్చింది. పార్టీ విధానం మేరకు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ఎన్నుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో రోజా మద్దతిచ్చిన ఎలకాటూరు ఎంపీటీసీ సభ్యురాలు దీప ఎంపీపీగా ఎన్నికయ్యారు.
అధిష్ఠానం ఆదేశాలతో మెత్తబడిన చక్రపాణిరెడ్డి తాత్కాలికంగా సర్దుకుపోయినా, ఆ తర్వాత నగరిలో ఏ కార్యక్రమం చేపట్టినా చక్రపాణిరెడ్డి వేరుగా పార్టీ కార్యక్రమాన్ని చేపట్టసాగరు. శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా ప్రభుత్వం చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరి నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
రోజాపై చక్రపాణిరెడ్డి బహిరంగ సవాల్ నుకూడా విసిరారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ఎలా గెలుస్తావో చూస్తానంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డికి శ్రీశైలం బోర్డు ఛైర్మన్‌గా పదవీకాలం పొడిగించటంపై రోజా తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలిసింది. అవసరమైతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి తన నిరసనను తెలియజేసే అవకాశముంది. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రోజా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.