
కరోనా దెబ్బతో సినిమా పరిశ్రమ కుదేలైపోయింది. లాక్‌డౌన్ వల్ల జనమంతా ఓటీటీ (OTT) బాట పట్టారు. వరల్డ్ సినిమాను ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు. అది కూడా వైరటీ కథలతో కూడిన చిత్రాలకు బాగా అలవాటుపడ్డారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లు తెరవాలనుకున్నారు. థర్డ్ వేవ్ కూడా ఉంటుందనే భయంతో ప్రభుత్వాలు 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చాయి. అనుమతులు దక్కాక అసలు జనాలు థియేటర్ గడప ఎక్కుతారో లేదో అనే అనుమానంతో తెలివి గల నిర్మాతలు పలు చిత్రాలతో ప్రయోగం చేశారు. సినిమా బావుందనే టాక్ వచ్చినా పూర్తి స్థాయిలో జనాలు థియేటర్‌లో అడుగుపెట్టలేదు. అదే తరుణంలో ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంచాలంటూ ఓ ఇష్యూ పైకొచ్చింది. కరోనా నుంచి పరిశ్రమను థియేటర్ల మనుగడను కాపాడుకోవాలంటే టికెట్ ధరలు పెంచాలంటూ పరిశ్రమ నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాదాపు నాలుగైదు నెలలు ఈ సమస్యపై చర్చలు జరిగాయి. ప్రభుత్వాల చుట్టూ తిరిగి ఎలాగైతే కావలసినట్లుగా టికెట్ రేట్లు (High tiket rates) పెంచుకునేలా జీవో తెచ్చుకున్నారు. ఆ రేట్లతో బడా చిత్రాలు విడుదలయ్యాయి. అధిక రేట్లతో రెండు మూడు చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆస్వాదించారు. ఆ తర్వాత రేట్ల ప్రభావం ప్రేక్షకుడిపై బాగా పడింది. వినోదం పొందాలంటే ఇంత మూల్యం చెల్లించాలా అన్న ఆలోచన మొదలైంది. ఆ రేట్లు తట్టుకోలేక సగటు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూడడం మానేశాడు. మూడు వారాలు దాటితే ఓటీటీలో, రెండు నెలల్లో టీవీలో సినిమాను చూసేమొచ్చు అనే ఆలోచనకు వచ్చారు. ఈ ఎఫెక్ట్‌ను నిర్మాతలు తొందరగానే తెలుసుకున్నారు. టికెట్ రేట్ల దెబ్బకు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకున్నారు. దాంతో సాధారణ రేట్లకే సినిమా టికెట్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. (TIcket rate effct on tollywood)
టికెట్ రేటు నామస్మరణే…
మామూలుగా ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ వేడుకల్లో తమ చిత్రాల గురించి గొప్పగా చెప్పుకొనే చిత్ర బృందాలు ఇప్పుడు సినిమా టికెట్ రేట్ల ప్రస్తావనతో ఈవెంట్‌ను ప్రారంభిస్తున్నారు. జనాలను థియేటర్లకు రప్పించడానికి రకరకాల స్టంట్లు వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏ వేదిక మీద చూసిన టికెట్ రేటే ప్రధానాంశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మా సినిమా చూడొచ్చు అన్న దార్లోకి నిర్మాతలు వచ్చారు. గడచిన రెండు వారాల్లో విడుదలైన ‘ఎఫ్3’, ‘మేజర్’ చిత్ర బృందాలు తమ సినిమాలో ఆసక్తికర విషయాలతోపాటు ప్రత్యేకంగా టికెట్ రేట్ల గురించి పత్యేకంగా ప్రస్తావించారు. త్వరలో విడుదల కానున్న ‘పక్కా కమర్షియల్’ చిత్ర నిర్మాతలు కూడా టికెట్ రేటుపై స్పష్టత ఇచ్చారు. మొన్నటి వరకూ ఓటీటీలు ఓ మోస్తరు చిత్రాలకు శ్రీరామరక్షగా నిలిచాయి. ఇప్పుడు అదే ఓటీటీతో చిత్ర పరిశ్రమ మనుగడకే ఇబ్బంది కలిగించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఎలాంటి సినిమా అయినా ఓటీటీలో విడుదలైపోతుంది. దీనితో థియేటర్‌లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. అందుకే ఓటీటీకి కాస్త దూరంగా జరగాలనుకుంటున్నారు మేకర్స్.

థియేటర్‌లో చూస్తేనే పరిశ్రమకు మనుగడ…(Allu Aravind)
టాలీవుడ్ బడా నిర్మాత, ‘ఆహా’ ఓటీటీ అధినేత అయిన అల్లు అరవింద్ ‘పక్కా కమర్షియల్’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘టికెట్లు రేట్లు తగ్గించడంతోపాటు ఓటీటీలకు కాస్త దూరంగా ఉండాలి. సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలో రాకుండా చూడాలి’ అని హితవు పలికారు. దీనితోపాటు తన తనయుడు అల్లు అర్జున్ ‘ఎఫ్3’ చిత్రాన్ని క్యూబ్‌లో చూస్తానంటే థియేటర్‌కి వెళ్లి చూడమని చెప్పా. ప్రేక్షకులు థియేటర్‌లో సినిమాలు చూస్తేనే పరిశ్రమకు మనుగడ’ అని అరవింద్ అన్నారు. ఓటీటీ అధినేత అయి ఉండి ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే పరిశ్రమ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవచ్చు. అంతకు కొద్ది రోజుల ముందు దిల్ రాజు కూడా టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు జనాలు తగ్గారని పేర్కొన్నారు. అందుకే తమ చిత్రం ‘ఎఫ్3’ సాధారణ రేట్లకే సినిమా చూడొచ్చని తెలిపారు. దీనిని బట్టి అధిక టికెట్ రేట్ల ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతోంది.
ఆ నిబంధనలు అమలు చేయాలి…గతంలో సినిమా విడుదలైన వంద రోజుల వరకూ శాటిలైట్ ఛానళ్లలో ప్రసారం చేయకూడదనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ హద్దులు చెరిపేసి ఇష్టమొచ్చినట్లు అనుమతులిచ్చారు. ఇప్పుడు ఓటీటీల వల్ల అదే పరిస్థితి ఎదురైంది. సినిమా విడుదైన రెండు మూడు వారాలకే ఓటీటీలో సినిమా దర్శనమిస్తుంది. దీని వల్ల థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. మూడు వారాలు ఓపిక పడితే ఇంట్లోనే కూర్చొని చూడొచ్చనే ఆలోచనకు ప్రేక్షకుడు వచ్చేశాడు. పరిశ్రమ, మనుగడ బావుండాలంటే ఎలాంటి సినిమా అయినా విడుదలైన రెండు నెలల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన అమలు చేయాలి. అదే అగ్రిమెంట్‌కు నిర్మాతలు కట్టుబడి ఉండాలి. అప్పుడే థియేటర్ మనుగడ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనలకు ఓటీటీ సంస్థలు అంగీకరిస్తాయా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఓటీటీలు సొంతంగా సినిమా తీసే ప్రయత్నం చేయవు. వారికి ఏకైక సోర్స్ చిత్ర పరిశ్రమ. ఈ నిబంధనలు అమలు అయితే ఓటీటీ కోసమే సినిమాలు తీసే నిర్మాతలు ఇబ్బంది పడాల్సిందే.