Telangana Inter Results 2022 will be able to download from the official website tsbie.cgg.gov.in.
Telangana Inter Results 2022 at tsbie.cgg.gov.in తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నట్లు నేడు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తేదీతోపాటు సమయం కూడా వెల్లడిస్తూ ఇంకొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఇంటర్ తర్వాతి ప్రణాళికల్లో తలమునకలై ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వార్త నిజమని నమ్మి షేర్ చేయడంతో ఈ వార్త వాట్సాప్‌లోనూ వైరల్ అయ్యింది.
ఇంటర్ ఫలితాలు వెల్లడి అంటూ జరుగుతున్న ప్రచారం వైరల్ అవుతుండటంతో చివరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులకు ఈ వార్తలపై స్పందించక తప్పలేదు. ఈ ప్రచారాన్ని ఓ తప్పుడు ప్రచారంగా కొట్టిపడేసిన ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్.. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
మే నెలలో పూర్తయిన ఇంటర్ పరీక్షలకు ఈమధ్యే మూల్యాంకనం ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ.. ఇంకొంత ప్రక్రియ మిగిలి ఉన్నందున ఫలితాలు ప్రకటించేందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 25వ తేదీలోగా ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.