గ్రేటర్‌లో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 12న జరగనున్న పరీక్షను పురస్కరించుకొని విద్యాశాఖాధికారులు ఎంపిక చేసిన సెంటర్లలో అభ్యర్థులకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. బెంచికి ఇద్దరు చొప్పున సీటింగ్ కేటాయించడంతోపాటు అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి సెంటర్‌లో 11 మంది ఇన్విజిలేటర్లు, ముగ్గురు పర్యవేక్షకులను నియమించారు.
రెండు సెషన్లలో..
టెట్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు మినహా మిగతా ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డ్యూటీలు కేటాయించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్ష కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకోవడంతో అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగింది.
