Congress forms alliance with TDP to fight Panchayat and Municipal polls in Andaman & Nicobar Islands
అవును.. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ బరిలోకి దిగుతోంది.. మీరు వింటున్నది నిజమేనండోయ్.. వినడానికి విచిత్రంగా ఉంది కదూ.. టీడీపీ ఆవిర్భావం జరిగినదే కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాది మీద. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద వ్యతిరేకతే ఆయుధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే అధికారాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా తెలుగుదేశం.. కాంగ్రెస్ వ్యతిరేకిగానే నిలిచింది.
ఎన్టీఆర్ హయాంలో అయినా, చంద్రబాబు చేతికి బాధ్యతలు వచ్చాకా అయినా కాంగ్రెస్ వ్యతిరేకంగానే నిలిచింది టీడీపీ. అయితే.. రాష్ట్ర విభజన, ఇతర పరిణామాలు ఇప్పుడు కాంగ్రెస్‌తో తెలుగుదేశం పొత్తు పెట్టుకునేలా దారి తీశాయి. అయితే 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు కలసి ప్రచారం నిర్వహించారు. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చంద్రబాబు దూరంగా పెట్టారు.
అయితే.. తాజాగా అండమాన్ నికోబార్ లో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ , టీడీపీలు కలసి పోటీ చేస్తున్నాయి. ఏఎన్ టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, తెదేపా స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయర్‌లో సమావేశమై ఈ నిర్ణయం వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు రంగలాల్ హల్దార్ తెలిపారు. ఈ మేరకు పోర్టు బ్లెయర్ మున్సిపాలిటీలో 2, 5, 16 వార్డుల్లో తెదేపా పోటీ చేయనుంది. మార్చి 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.