YSR Free Crop Insurance
ఏరువాకతో సాగుకు సిధ్దమవుతున్న రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021 ఖరీఫ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా చూస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటిస్తారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లి చేరుకుంటారు. 10.50 నుంచి 11.05 గంటల మధ్య స్థానిక నేతలను కలుస్తారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.